సరదా “కాలమ్”!!!

పుస్తకాలలో, దిన,వారపత్రికలలో సరదా "కాలమ్ లు" ఉంటాయి.సరదాకి "కాలం"-అదే సమయం అండీ! దానికి "సమయం - సందర్భం" ఉంటాయిజీవితంలో! కానీ,ఎప్పుడూ జీవితంలో సరదాగా ఉంటానికి కాదు.

మనిషిజన్మ అనేది భగవంతుడు ఇచ్చిన వరం,దాన్ని అనవసరంగా కొంతమంది చాలా తీవ్రంగా( సీరియస్ గా) తీసుకొని బతికేస్తూ ఉంటారు.దీని వల్ల వీరు జీవితంలో సరదాగా ఉండకపోవడమే కాకుండా, ఇతరులతో కూడా అలాగే ప్రవర్తిస్తారు.

వీళ్ళ ఉద్దేశం బహుశా,మరోటి కూడా ఉండొచ్చు. "జీవితం ఆషామాషీ కాదు" అని, ఎక్కడో చదవడమో, వినడమో జరిగిఉంటుంది.మనం మాత్రం ఆమాట అనలేదు. "సరదాగా మాత్రమే” ఉండమంటున్నాం-అంతే, ఇది మాత్రం ఆషామాషీకి కాదు, నిజ్జంగానే !

వీళ్లు ఇంకా నయమండి-"గుడ్డిలో మెల్ల"-ఇంకొందరు ఉంటారు,ఎప్పుడూ మొహం "మొట మొటలాడిస్తూనే"ఉంటారు.బహుశా ఆసుపత్రిలో పుట్టినప్పుడు"నర్సు మొహమో,డాక్టరు మోహమో" నచ్చిండుకపోవచ్చు! ఒకవేళ అదే కారణం అయితే,అదీ తప్పే; ఎందుకంటే,ప్రసవంచేసే సమయంలో డాక్టరు, నర్సు నవ్వుతూ ఉంటారేంటండి- మరీ విడ్డూరం కాకపోతేనూ!

వేరే కారణాలు కూడా ఉండొచ్చు,మనకి చెప్తారా ఏంటి,వాళ్ళమోహాలు అలా పెట్టడానికి- బహుశా,భగవంతుడి "రూపకల్పనలొనే"( డిజైన్లో)తేడా అయిఉండొచ్చు("ఈరకంలో" కొంతమందిని చూస్తుంటే ఇదేకారణం అని నాఘట్టి నమ్మకం!!!)

వారు, మొహాలు అలా పెట్టడానికి-వారి పుట్టుకకీ కూడా ఉన్నట్టు రకరకాల కారణాలు ఉండొచ్చు.కారణాలు ఏవైనా వీళ్లని నేనడిగేది ఏంటంటే జీవితంలో కొంచమన్నా "సరదాగా" ఉండమని- "ఆషామాషీగా" ఉండమని కాదు.

మీక్కూడా ఇలాంటివాళ్లు తారసపడితే మాత్రం మీరు కూడా ఈ సలహా ఇవ్వమని నా ఉద్దేశం కూడా- ఇదండీ నా మనసులో మాట, దాచుకునే అలవాటు లేదాయే మరి.మొహంమీద కొట్టినట్టు చెప్పకపోయినా, గుంభనంగా అయినా చెప్పితీరటం నా అలవాటు, నామొహాన్ని అలా పుట్టించాడు మరి,నేనేం చేస్తా!

ఉంటా మరి, సరదాకి కూడా ఒక హద్దు ఉంటుందని అనే వాళ్ళు కూడా ఉన్నారుగా!

divider

Share your thoughts with Author!!

Spread the words out!!!